Monday, June 30, 2014

గుండమ్మ కథ అధ్యాయం -1 : మేయిన్ ప్లాట్ కు సహకరించడమే సబ్ ప్లాట్ యొక్క ముఖ్య ఉద్దేశం

గుండమ్మ కథ - ఈ కథ తెలుగు ప్రేక్షకులు మరిచిపోలేని కథ. ఇందులో మనకు N.T.R హాస్యం, A.N.R అందం, సావిత్రి సౌమ్యం, జమున కోపం, గుండమ్మ అదే సూర్యకాంతం గయ్యాళితనం చాలా బాగా సుపరిచితం. అయితే, వీరందరూ కథ లోని ముఖ్య పాత్రలు. వీరిగురించి  మనం ఇంకా ఇంత బాగా గుర్తుపెట్టుకున్నాము అంటే అది ఆ రచయితల (కథ - చక్రపాణి గారు, మాటలు - డి.వి. నర్సిరాజు గారు) గొప్పతనం. దాని గురించి చెప్పక్కర్లెదు. కాని, ఆ రచన లోని మరో గొప్ప కోణాన్ని ఇక్కడ మీకు ప్రస్తావన చేయాలనుకుంటున్నాను.

అది ఒక చిన్న పాత్ర - ఒక చిన్న పాత్ర ని ఎలా అసలు కథ కు ఉపయోగపడేలా వాడుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం

చిత్రం మొదలైన తొలి పది-పదిహేను నిమిషాలలో  మాత్రమే ఆ పాత్ర మనకు కనిపించేది. నిడివి పరంగా అది తక్కువ సమయమే అయినా, కనపడే సన్నివేశాలు రెండు-మూడే అయినా, ఆ పాత్రే చిత్రానికి కావాల్సిన ముఖ్యమైన టర్నింగ్ పాయింట్ కు దోహద పడుతుంది.
అదే, నటుడు బాలకృష్ణ (నందమూరి బాలకృష్ణ కాదండోయ్... అప్పటి హాస్య నటుడు) యొక్క హోటల్ లోని సర్వర్ పాత్ర.

సినిమా మొదలైన తోలి అయిదు నిమిషాలలోనే మనకు, గుండమ్మ, సావిత్రి, జమున, ఘంటయ్య (రమణా రెడ్డి), ఘంటయ్య భార్య, ఘంటయ్య దంపతుల కోరిక, వారి కొడుకు రాజనాల గురించి తెలిసిపోతాయి. కథానాయకులు ఇద్దరు మరియు వారి తండ్రి S.V.R తప్ప మొదలైన ముఖ్య పాత్రలెంటో మనకు అయిదు నిమిషాల్లోనే చెప్పారంటే, స్క్రీన్ ప్లే ఎంత వేగంగా ఉందో గమనించండి.

సరే, ఇక విషయానికి వస్తే, ఘంటయ్య ది వృత్తి  పరంగా పాల వ్యాపారం. యుక్తి పరంగా పాలల్లో నీళ్ళు కలిపి అమ్మే వ్యాపారం. అలా నీళ్ళ పాలను ఒక హోటల్ కి అమ్ముతూ ఉంటాడు.  ఆ హోటల్ లో పనిచేసే సర్వర్, బాలకృష్ణ కాస్త అసహనపు కోపిష్టి (కాస్త ఎక్కువే).

నీళ్ళ పాలేంటి అని ఘంటయ్య తో రోజు తగువే. ఘంటయ్య మాటకారి కనుక బాలకృష్ణ ని ఏదోలా శాంతింపచేస్తుంటాడు. అలానే ఒకరోజు గడుస్తుంది.

ఈ సంభాషణ వల్ల  ప్రేక్షకులకు బాలకృష్ణ పాత్ర పరిచయం అయ్యింది. ఆ మరువెంటనే ఒక కస్టమర్ తో గొడవ పడి దానికి హోటల్ యజమాని, అల్లు రామలింగయ్య తనకు సహకరించక పోవడంతో కోపం తో , అసహనం తో పని వదిలేసి వెళ్ళిపోతాడు.

ఈ సీను చూస్తే, హాస్యం కోసం రాసిన సబ్ ప్లాట్ లేదా సైడ్ ట్రాక్ అని అనిపిస్తుంది.
కథ కాస్త ముందుకి వెళ్ళాక, గుండమ్మ తన కూతురు జమున కోసం సంబంధాల వేట లో ఉన్నప్పుడు, S.V.R మరియు N.T.R & A.N.R పాత్రల పరిచయం జరిగిపోయి జమున ని చూడడానికి గుండమ్మ గురించి తెలుసుకోవడానికి S.V.R గుండమ్మ ఇంటికి వస్తున్నప్పుడు మనకు మళ్లి బాలకృష్ణ ఎదురు అవుతాడు.

హోటల్ లో పని మానేశాను , పని ఇప్పించమని ఘంటయ్య ను అడుగుతాడు సర్వర్ బాలకృష్ణ . సరే అని  గుండమ్మ ఇంటికి తీసుకెళ్తాడు ఘంటయ్య. ఆ ఇంటి గురించి, గుండమ్మ గురించి తెలుసు కనుక బాలకృష్ణ వెంటనే భయపడి, బాబోయి ఈ ఇంట్లో పనికి నేను రాను అంటూ పారిపోతాడు. ఇలా బాలకృష్ణ భయపడి గుండమ్మ గురించి చెప్తూ పారిపోయే దృశ్యం లో S.V.R  అక్కడ అప్పుడు గుండమ్మ ఇంటికి వస్తుంటాడు. ఈ మాటలు వింటాడు. బాలకృష్ణ పారిపోవడం గమనిస్తాడు.

ఆ తరువాత ఘంటయ్య తో S.V.R పరిచయం, వెంటనే  ఇంట్లో గుండమ్మ పరిచయం, సావిత్రి పరిచయం,  జమున పరిచయం జరుగుతాయి. మొత్తం ఇంటి వాతావరణం ఇంట్లో మనుషుల ప్రవర్తన అన్ని S.V.R కి అర్థం అవుతాయి. అంతా గమనించి తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు.

తను చుసినదంతా అక్కడ జరిగినదంతా పిల్లలిద్దరికి చెప్తాడు. ఇక్కడ సావిత్రి గురించి చెప్తున్నప్పుడు  తనని ఎవడైనా పని వాడికి ఇచ్చి చేయాలని గుండమ్మ ఆలోచన అని చెప్తాడు. అప్పుడు N.T.R, అయితే పని వాడిగా నేను వెళ్తే సరి అంటాడు.

ఇది N.T.R , గుండమ్మ ఇంట్లో  పనివాడిగా వెళ్ళడానికి పడిన భీజం.

అయితే ఇక్కడ మనం గమనించాల్సింది, ఆ ఇంట్లో పని వాడంటే వాడు ఎంత కష్టపడాలో ఆ ఇంట్లో వాళ్ళతో ఎలా వేగాల్సి వస్తుందో, గుండమ్మ ఎంత పీడిస్తుందో ఇవన్నిటికీ  N.T.R సిద్దపడుతున్నాడు అనే భావన చూసే వారికి కలిగేలా చేసింది బాలకృష్ణ పాత్ర.

తను హోటల్ లో మానెయ్యడం, ఘంటయ్య ద్వారా గుండమ్మ ఇంటికి రావడం, ఇక్కడ పని చేయల్లేను బాబోయి అంటూ వెళ్ళిపోవడం  అది S.V.R కంట్లో పడటం, తరువాత N.T.R నేను పని వాడి లాగానే వెళ్తాను అని అనడం.
ఇవ్వన్ని ప్రేక్షకులలో N.T.R  వీటిని ఎలా తట్టుకుంటాడు, ఎలా అధిగమిస్తాడు అనే ఉత్సుకథని నింపుతాయి. తరువాత కథ లో ఎలాంటి సన్నివేశాలు వస్తాయో చూడాలి అనే కుతూహలాన్ని పెంచుతాయి.

నిజానికి బాలకృష్ణ పాత్ర లేకుండా కుడా N.T.R అక్కడికి పనివాడిలా వెళ్ళిండవచ్చు. కాని ఇలా ఒక సబ్ ప్లాట్ లోని పాత్ర, బాలకృష్ణ ను ఎస్టాబ్లిష్ చేసి, మెయిన్ ప్లాట్ కు సంబంధం లేక పోయినా అందుకు ఉపయోగపడేలా రచించారు.

దీని వల్ల, బాలకృష్ణ పాత్ర కేవలం హాస్యానికే రాసినది అని కృత్రిమ భావన కలగనివ్వకుండా, అసలు కథ కు కూడా సహకరించేలా మలిచారు.

అలా నాకు ఈ పాత్ర లోని ప్రాముఖ్యత తెలిసేలా, మీతో పంచుకునేలా చేసారు.
ఇంకా ఈ 'గుండమ్మ కథ' లోని కథనాలు చాలా ఉన్నయి... త్వరలో వాటిని కూడా మీతో పంచుకుంటాను.

- సాయి కిరణ్  

4 comments:

  1. చకగా వివరించావు సాయి ... బాగుంది

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు విస్సు...

      Delete