Tuesday, July 1, 2014

గుండమ్మ కథ అధ్యాయం - 2: పాత్ర ను వాడుకోవడం ఎలా...?

గుండమ్మ కథ చిత్రం లో మనకు గుర్తుపెట్టుకోడానికి వీలులేనన్ని పాత్రలు లెవు. గుర్తుపెట్టుకునేలా, గుర్తుండిపోయేలా ఉండే పాత్రలే ఉన్నాయి. అలాంటి గుర్తుండి పోయే ఒక చిన్న పాత్ర గురించి చెప్పుకుందాం. నిజానికి పాత్ర చిన్నదే అయినా ప్రధాన కథ కు ఉపయోగపడే పాత్ర ఇది.

ఆ పాత్ర యొక్క అవసరం, ఆ పాత్ర మొదలు మరియు ముగింపు, అసలు రచయిత ఎలా ఆ పాత్ర ని వాడుకున్నారో చూద్దాం.

మనకు గుండమ్మ కథ గురించి చెప్పమంటే ముందుగా తట్టేది గుండమ్మ యొక్క వ్యవహార శైలి. తన గయ్యాళితనం. ఇది అందరికి సినిమా పేరు వినగానే గుర్తుకు వస్తుంది. అయితే మనం గమనించాల్సింది, మరి ఎలా మన గుండమ్మ కు బుద్ధి వస్తుంది? ఎలా తను మంచి మనిషి గా మారుతుంది?

ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే పాత్రే - ఛాయాదేవి పాత్ర. ఈ పాత్ర కూడా సబ్ ప్లాట్ ని మెయిన్ ప్లాట్ తో మేలివేయడానికి ఉపయోగించిన పాత్రే. ఇది మనం గమనించాల్సింది. అది ఎలా చేసారంటే,
కథ మొదలైన అర గంట కి ఇందులో 3 ప్రేమ కథలు ఉన్నాయి అని తెలుస్తాయి. అవి, N.T.R- సావిత్రి, A.N.R- జమున మరియు హరినాథ్- విజయలక్ష్మి (సినిమా లో ఈమె పేరు పద్మ).

ఈ హరినాథ్ ప్రేమ కథ - సబ్ ప్లాట్.

అయితే ఈ మూడు ప్రేమ జంటలు ప్రేమ లో పడి, బాగా మునిగి,  మానసికంగా ఒకే స్థాయి లో ఉంటారు, కథ 50 ని. గడిచాక. అలా అందరిని ఒకే తాటి పైకి తీసుకురావడం రచన లోని మరో గొప్పతనం. అయితే, 50 ని. తరువాత మనకు ఛాయాదేవి పరిచయం జరుగుతుంది. తను పద్మ మేనత్త. సబ్ ప్లాట్ కు సంబంధించిన పాత్ర. పద్మ ఇంటికి పెట్టె పట్టుకు మరీ వచేస్తుంది. అక్కడ సన్నివేశం తో తన క్యారక్టర్ ఏంటి అనేది ప్రేక్షకులకు అర్థమైపోతుంది. అప్పుడు పద్మ తన ప్రేమ గురించి చెప్పినప్పుడు, అమ్మో! గుండమ్మ తో వియ్యమా అని పద్మ తల్లిదండ్రులు కంగారు పడ్డప్పుడు మన ఛాయాదేవి, నేనున్నాను అని పద్మ కు ధైర్యం ఇస్తుంది.

అక్కడ మనకు, త్వరలో గుండమ్మ- ఛాయాదేవి ల మధ్య జగరబోయే యుద్ధం గురించి సంకేతాలు పంపించాడు రచయిత - a spark of what is going to come next and come big

ఆ తరువాత కథ రెండో బాగం లో, సావిత్రి N.T.R  తో కలిసి ఇల్లు వదిలి వెళ్ళిపోయాక, A.N.R  నాటకం ఆడుతూ తను మోసాగాడని, గుండమ్మ ను జమున ను నమ్మించాక, పద్మ - హరినాథ్ పెళ్లి అయిపోయాక, కొడుకు హరినాథ్ కూడా తనను సరిగ్గా చూడట్లేదని గుండమ్మ భాదపడుతుండగా, మనకు మళ్లి ఛాయాదేవి కనిపిస్తుంది. తను ఈ సారి గుండమ్మ ఇంట్లో తిష్ట వేస్తుంది.

పైన చెప్పిన సంఘటనల వల్ల , కథ పరంగా జరిగే అతి ముఖ్య ఘట్టం - గుండమ్మ లో మార్పు. తన వాళ్ళందరూ తనకి దూరం అవ్వడం లేదా తనని పట్టించుకోకపోవడం, కూతురు భవిష్యత్తు పాడైపోవడం, ఇల్లంటివి తనని భాదిస్తుంటే, ఖచితంగా తనలో మార్పు మొదలవుతుంది- Character Transformation.

అసలు కథంతా ఇదే కదా... గుండమ్మ ను మార్చడమే కదా కథానాయకుల ముఖ్య లక్ష్యం. (పెళ్లి కూడా అనుకోండి)

కాని ఇలాంటి సమయం లో కూడా అంత సులువు గా మారిపోదు గుండమ్మ - అందుకే తను గుండమ్మ!
ఆఖరి దెబ్బ - అది కూడా గట్టిగా తగిలితే గాని దెయ్యం దిగిరాదు. గుండమ్మ అంతే. అందుకే ఆమెకున్న దెయ్యాన్ని దించడానికి , ఛాయాదేవి పాత్ర ను వాడుకున్నాడు రచయిత.

ఛాయాదేవి, గుండమ్మ ఇంటికి వచ్చాక మెల్లగా అజమాయిషీ చెలాయించటం మొదలుపెడుతుంది. గుండమ్మ డబ్బు, స్వేచ్ఛ అన్ని లాగేసుకుంటుంది. ఒక అరగంట కు అంటే ఇంక కథ తారాస్థాయి కి చేరినప్పుడు, గుండమ్మ పరిస్థితి - ఒక గదిలో నిర్భందకురాలు. డబ్బు పోయింది. పిల్లలు వదిలి వెళిపోయారు. ఒంటరిది అయిపొయింది. అప్పుడు ఇవ్వన్ని జరగడం తో, తన తప్పులేంటో తెలుసుకొనడం తో తన లో మార్పు వస్తుంది.

అంటే లక్ష్యం నెరవేరింది. మరి ఆ మార్పు కి తన వంతు సాయం చేసిన ఛాయాదేవి కి కూడా గౌరవం దక్కాలి కదా. ఇక్కడే రచయిత ప్రతిభ మనకు తెలుస్తుంది.

గుండమ్మ లో మార్పు కోసం ఛాయాదేవి పాత్ర ని వాడుకున్నాడు. మార్పు వచ్చింది. పాత్ర ను తీసి పాతాళం లో పడేసాడు. అదే , సావిత్రి N.T.R తో కలిసి ఇంటికి వచ్చి, ఒంటరిగా ఏడుస్తూ ఉన్న గుండమ్మ ను ఓదార్చి, మార్పు ను గుర్తించి, గుండమ్మ ని బాధపెడుతోంది ఛాయాదేవి అని గమనించి , ఛాయాదేవి ని తన్ని తరిమేసెలా చేసాడు.

ఇలా అవసరం తీరిపోయాక పాత్ర ను పారవేసినా,  పారవెయ్యడానికి కూడా ఒక సహజ రూపం ఇచ్చి, కథ చివరిలో దాన్ని గుచ్చారు రచయిత.

అవసరం లేని పాత్రలనే కాదు, అవసరం తీరిపోయిన పాత్రలను కూడా కథలో ఉంచకూడదు, వాటికి శుభం కార్డు దగ్గర చోటు ఇవ్వాల్సిన అవసరం లేదు అనే ఒక కొత్త కోణాన్ని తన రచన ద్వారా రచయిత సూచించారు అని నా అభిప్రాయం.

- సాయి కిరణ్