Friday, August 29, 2014

మిస్. మేరి... మిస్సమ్మ...మహానటి... - 1

మిస్సమ్మ - ఇది పరిచయం అక్కర్లేని పేరు. ఒక మహానటి యొక్క నటనా ప్రావిణ్యాన్ని మరోసారి ఆవిష్కరించిన చిత్రం. ఆ మహానటి ని తెలుగు సినీ అభిమానుల గుండెల్లో చిరస్థాయి గా నిలిచిపోయేలా చేసిన చిత్రాల్లో ఇది మొదటిది అనడం లో అతిశయోక్తి లేదు. మరి అలాంటి మహానటి నటించిన ఈ మిస్సమ్మ విశేషాలు ఏంటి, ప్రత్యేకతలు ఏంటి అనేది కాస్త తొంగిచూద్దాం రండి.

గొప్పగా ఆలోచించడం, ఆ ఆలోచనలు కాగితం మీద అంతే గొప్పగా పెట్టడం లో రచయిత యొక్క ప్రతిభ తెలుస్తుంది. కాని అలా కాగితం మీద పెట్టిన దాన్ని తెర మీదకు అంతే గొప్పగా తీసుకురావాల్సిన భాద్యత దర్శకుడి ది మరియు నటీ-నటులది. అయితే నటనా ప్రధానమైన చిత్రాల్లో దర్శకుడి సగం భాద్యత, నటీ-నటుల ఎంపిక దగ్గరే తీరుతుంది.  ఆ తరువాత అసలు భాద్యత అంతా ఆ నటులదే. వారి నటనే చిత్రానికి, వారికి మంచి పేరు తెచ్చిపెట్టేది అనడం లో ఏ సందేహమూ లేదు.

అలా  మహానటి ఎంపిక తో దర్శకుడు సగభారం తీర్చుకోగా, తన నటన తో అందరిని జయించేసి, ఈ 'మిస్సమ్మ' కు మన 'మిస్సమ్మ' మహానటి సావిత్రి గారే  ప్రధాన ఆభరణంగా నిలిచారు. ఒక్కమాటలో చెప్పాలంటే, ఈ కథ నడిచేదే మిస్సమ్మ చుట్టూ. తన జీవితపు సంఘటనలే కదా సినిమా అంతా. అందుకే కదా సినిమా పేరు కూడా 'మిస్సమ్మ' అయింది. కనుక అలాంటి మిస్సమ్మ ను, మిస్సమ్మ కథ ను వేరు చేసి చూడలేము.  'మిస్సమ్మ' తో పాటుగానే మిస్సమ్మ కథ గురించి కూడా చూద్దాం...

కథాపరంగా, మిస్సమ్మ అసలుగా మహాలక్ష్మి. S.V.R దంపతుల పెద్దమ్మాయి. నాలుగేళ్ల వయస్సు లో కాకినాడ లో తప్పిపోయింటుంది. ఆ కుటుంబానికి దూరమైనా వారు మాత్రం తమ మహాలక్ష్మి ఎప్పటికైనా దక్కుతుందనే ఆశ తో బ్రతుకుతుంటారు. వారి మేనల్లుడు A.N.R, డిటెక్టివ్ అని చెప్పుకుంటూ, తప్పిపోయిన బర్రెలను, దూడలను వెతికిపట్టుకుంటూ హాస్యాన్ని పండిస్తుంటాడు.

అయితే S.V.R కి ఒక స్కూల్ ఉంటుంది. అందులో అధ్యాపకులు గా అల్లు రామలింగయ్య, A.N.R లు ఉంటారు. A.N.R తను హెడ్-మాస్టర్ అని చెప్పుకుంటూ ఉంటాడు. అది వేరే విషయం. మన అల్లు, వైద్యుడు కూడా(గుర్తుపెట్టుకోండి). కాని ఇద్దరు అప్రయోజక అధ్యాపకులు. ఇది గమనించి S.V.R, ఇద్దరు  కొత్త పంతుల్ల కోసం A.N.R ని ప్రకటన వేయిన్చమంటాడు. అప్పుడు మన A.N.R అతితెలివితో వారు దంపతులైతే మంచిది అని సలహా ఇస్తాడు. S.V.R కూడా సరే అంటాడు. అలా  'B.A. పాస్ అయిన జంట కు ఉద్యోగం' అనే ప్రకటన వెలువడుతుంది.

అయితే, తప్పిపోయిన వాళ్ళ అమ్మాయి మహాలక్ష్మి గురించి A.N.R దగ్గర  చెప్తూ, పులిగోరు- కుడికాలి మీద పుట్టుమచ్చ అని రెండు గుర్తులు చెప్తుంది మహాలక్ష్మి అమ్మ. ఇవి చాలు ఎలాగైనా పట్టుకుంటాను అంటాడు A.N.R. ఆ వెంటనే మనకు సంగీత పాఠాలు చెప్తూ, మిస్సమ్మ కనిపిస్తుంది. తన కుడి కాలి పై పుట్టుమచ్చ ని కూడా చూపించి దర్శకుడు మహాలక్ష్మి ఎవరు అనే సస్పెన్స్ కి, చిత్రం మొదటి 15 నిమిషాల్లోనే తెర దించేసాడు. అయితే మిస్సమ్మె మహాలక్ష్మి అని వాళ్ళు ఎలా తెలుసుకుంటారు, A.N.R నిజంగానే కనుక్కోగలుగుతారా అనేదే మిగిలిన కథ.
అయితే, తను సంగీత పాఠాలు చెప్తున్న అమ్మాయి వాళ్ళ నాన్నగారికి ఇంకో ఉరికి ట్రన్స్ఫెర్ అవ్వడం తో తన ఉద్యోగం పోతుంది. కాని ఆయన ఇంకో చోట ఉద్యోగం కోసం మిస్సమ్మ కి తన సిఫార్సు ఉత్తరం ఇస్తాడు. అది తీసుకుని మిస్సమ్మ వెళ్తుండగా రావు (N.T.R) ఎదురవుతాడు. తను ఆ ఇంట్లో అబ్బాయికి ప్రైవేటు చెప్తుంటాడు. తనకి కూడా ఆ ఆఫీసర్ సిఫార్సు ఉత్తరం ఇస్తాడు. అనుకోకుండా మిస్సమ్మ మరియు రావు ఒకే చోట ఇంటర్వ్యూ కి వస్తారు. కాని అక్కడ ఇద్దరికీ ఉద్యోగం దొరకదు. తిరిగి వెళ్ళిపోతారు.

మిస్సమ్మ కోపం:
----------------
మిస్సమ్మ లో కోపాన్ని మొదటిసారిగా చూసేది ఆ ఇంటర్వ్యూ లోనే. అక్కడ ఇంటర్వ్యూ చేసే గుమ్మడి, ఉద్యోగం కాకుండా ఉచిత సలహా ఇవ్వడం తో మిస్సమ్మ కోపానికి బలవుతాడు. అప్పుడే మనకు మిస్సమ్మ కోపం ఒక మెరుపు లా కనిపిస్తుంది.

మిస్సమ్మ తల్లి-దండ్రులు వృద్ధులు. వారు డేవిడ్(రమణారెడ్డి) దగ్గర అప్పు చేసింటారు. రోజు డేవిడ్ అప్పు కోసం వస్తుంటాడు. తనకి మిస్సమ్మ ని పెళ్లి చేసుకోవాలనే ఆశ. ఆకారణంగా వస్తుంటాడు. అప్పు తీర్చండి లేదా మిస్సమ్మ ని ఇచ్చి పెళ్లి చేయండి అని బలవంతపెడుతుంటాడు. డేవిడ్ కూడా మిస్సమ్మ కోపానికి బాదితుడవుతాడు.

మిస్సమ్మ కోపం - అసహనం - అఇష్టం:
---------------------------------------
ఇక్కడ ఆ డేవిడ్, అప్పు తీర్చండి లేదా మిస్సమ్మ ని ఇచ్చి పెళ్లి చేయండి అని గొడవ చేస్తుంటే, మిస్సమ్మ కోపం తో అసహనం తో వాడ్ని ఎడా-పెడా తిట్టి తరిమేస్తుంది. ఆ వెంటనే, వాళ్ళ నాన్న తో , తన దగ్గరున్న బంగారు ఆభరణం అమ్మేసి డేవిడ్ అప్పు తీర్చేద్దాం అంటుంది. ఆ ఆభరణం పైన హిందూ దేవతల బొమ్మలు ఉంటాయి. వాళ్ళు మాత్రం, తమకు అది కలిసోచ్చినది అని అంటారు. అప్పుడు మిస్సమ్మ, "క్రైస్తవ నగల మీద హిందూ దేవుళ్ళ బొమ్మలేంటి, పిచ్చి దేవుళ్ళు, పిచ్చి మతం" అని తనకున్న అఇష్టత ని చూపిస్తుంది. అప్పుడు వాళ్ళ నాన్న, అది తప్పు, అన్ని మతాలూ ఒక్కటే అని చెప్తాడు.  కాని మిస్సమ్మ మాత్రం ఆ మాటలను తేలికగా తీసుకుంటుంది ఎందుకంటే తనకు క్రైస్తవ మతమంటేనే ఇష్టం.

ఈ సన్నివేశం తనకు హిందూ మతం మీద అఇష్టత, క్రైస్తవ మతం మీద ఇష్టాన్ని చూపుతాయి (ఇది మిస్సమ్మ పాత్ర యోక్క అభిరుచి మాత్రమే అని గమనించాలి) ఈ సన్నివేశం, తరువాత రాబోవు కథ రెండో భాగానికి పునాది మెట్టులాంటిది. ఎందుకంటే, కథ రెండో భాగం లో తనకు  S.V.R ఇంట్లో హిందూ సంప్రదాయ పద్దతుల్లో మర్యాదలు చేసినప్పుడు, ఆ అఇష్టత, ఆ అసహనం, ఆ కోపం అన్ని బయటపడతాయి. అలా అక్కడ అవి కనపడాలంటే వాటిని ముందే ప్రేక్షకులకు తెలియజేయడానికే ఈ సన్నివేశం లో ఈ సంభాషణలు రాసివుండొచ్చు అని నా అభిప్రాయం.

ఇక్కడ ఒకటి గమనిస్తే, S.V.R కుటుంబం ఎక్కడో ఉంది... మిస్సమ్మ ఎక్కడో మేరి గా ఉంది. మరి ఇద్దరూ ఎలా కలుస్తారు, మధ్యలో N.T.R పాత్రెంత? A.N.R, జమున ల అవసరము ఎంత? త్వరలోతెలుసుకుందాం.

- సాయి కిరణ్  

No comments:

Post a Comment