Friday, August 29, 2014

మిస్. మేరి... మిస్సమ్మ...మహానటి... - 2

అలా మిస్సమ్మ, రావు తమ ఇంటర్వ్యూలు పోగొట్టుకున్న తరువాత మనకు రేలంగి పాత్ర పరిచయం అవుతుంది. తను వేషాలు వేసుకుంటూ, జనాన్ని బురిడి కొట్టిస్తూ,  'అడుక్కుంటూ' డబ్బు సంపాదిస్తుంటాడు. మన రావు కి ఇల్లు-వాకిలి లేదు. 'నా' అనే వారు లేరు. ఒక పార్కె అతని రాజభవనం. అక్కడ ఉండగా రేలంగి పరిచయం అవుతుంది. అప్పుడు రావు పేపర్ లో ఒక ఉద్యోగ ప్రకటన చూస్తాడు. అది B.A పాస్ అయిన 'దంపతుల' కు అని ఉంటుంది. తను ఇంకా బ్రహ్మచారి B.A కనుక ఆశలు వదులుకుంటాడు. అదే పార్క్ కి మిస్సమ్మ కూడా వస్తుంది. రావు మిస్సమ్మ కి ముందు జరిగిన ఇంటర్వ్యూ దగ్గర పరిచయం వల్ల ఒకరిని ఒకరు గుర్తుపడతారు. ఆ ప్రకటన గురించి మిస్సమ్మ కి చెప్పగా, తనకు పెళ్లి కాలేదని మిస్సమ్మ చెపుతుంది.

మిస్సమ్మ కోపం:
ఉచిత సలహాలంటే తనకెంత కోపం అనేది మళ్లి ఇక్కడ తెలుస్తుంది మనకి. అలా తనకి పెళ్లి కాలేదనగానే, వెంటనే రావు ఒక ఉచిత సలహా ఇస్తాడు, ఎవరైనా B.A పాస్ అయిన అబ్బాయిని పెళ్లి చేసుకొని ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోమని. ఇందులో కొంటెతనం లేదండోయ్. పాపం రావు మంచివాడు. కాని ఆ మాటలకు మిస్సమ్మ కు వెంటనే కోపం వస్తుంది. వెంటనే 'థాంక్స్' అని కోపంగా అనేసి అక్కడినించి వెళ్ళిపోతుంది. తన కోపం అంతా రావు కళ్ళల్లో భయంగా మనకు కనిపిస్తుంది. 

నిజానికి, ఆత్మాభిమానం (ఇగో కూడా) ఎక్కువ ఉన్నవారు అంత సులువు గా పక్కవారి సలహాలను స్వీకరించారు.

అలా వెళ్ళిపోయిన మిస్సమ్మ ను మన డేవిడ్ మళ్లి తగులుకుంటాడు. తనను పెళ్లి చేసుకో అని మళ్లి బలవంతపెడతాడు. ఆ మధ్య లో రేలంగి అడ్డువచ్చి కాస్త నవ్వులు పండించినా, డేవిడ్ మిస్సమ్మ ని వదలడు. చివరికి మిస్సమ్మ మళ్లి తిరిగి రావు దగ్గరికి వస్తుంది. రావు కాస్త కలగచేసుకొని
డేవిడ్ కి ఏదో  సర్దిచెప్పి, మిస్సమ్మ రెండు మాసాల్లో అప్పు తీర్చేస్తుంది అని చెప్పించి, ఒప్పించి, పంపించేస్తాడు.

డేవిడ్ వెళ్ళిపోయాక, మిస్సమ్మ తో రావు మళ్లీ ఒక ఐడియా చెబుతాడు. ఇద్దరికీ డబ్బు అవసరం ఉంది కనుక, ఇద్దరమూ భార్య-భర్తలు గా నాటకమాడి, ఆ రెండు మాసాలు ఆ స్కూల్ టీచర్స్ గా ఉద్యోగం లో చేరితే, ఇద్దరి కష్టాలు తెరుతాయి కదా అని అంటాడు.

మిస్సమ్మ కోపం:
మన మిస్సమ్మ కు మాములుగానే కోపం క్షణాల్లో వచేస్తుంది. రావు ఇలా అనగానే వెనువెంటనే అతని మీద అరిచేస్తుంది. ఇందులో రావు డి ఏదో దుర్బుద్ధి ఉందంటూ,  తనకు నచ్చలేదని అక్కడినుంచి వెళ్ళిపోతుంది.

కోపం తో వెళ్లిపోయి దూరంగా కూర్చుంటుంది. ఇదంతా గమనిస్తున్న రేలంగి, రావు దగ్గరికి వచ్చి ఈ ఐడియా పారేటట్టు లేదు అంటాడు. అప్పుడు మన రావు, ఆడవారు అవునంటే కాదన్నట్టు కాదంటే అవునన్నట్టు, ఖచితంగా రేపు తను ఒప్పుకుంటుంది చూడు అంటాడు.

అప్పుడే మనకు బాగా నచ్చిన పాట,
" అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే.. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే.. అర్థాలే వేరులే...అర్థాలె వేరులే "
ఇదంతా దూరం నుంచి వింటూ మిస్సమ్మ నవ్వుకుని వెళ్ళిపోతుంది.
మిస్సమ్మ ఇంట్లో వాళ్ళ నాన్న, ఆ  డేవిడ్ పెడుతున్న ఇబ్బందులకు బాధపడుతుండగా, తను అప్పు తీర్చేస్తాను, స్కూల్ టీచర్ ఉద్యోగ ప్రకటన చూసాను. ఆ జీతం తో రెండు మాసాల్లో అప్పు తీర్చేయచ్చు అని మిస్సమ్మ  వారికి చెప్తుంది. (రావు చెప్పినట్టు - కాదంటే అవుననిలే).  తను పడుకునేముందు ఏసుక్రీస్తు కి ప్రార్థన చేసి పడుకుంటుంది.

ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం -  Character Motivation

Character Motivation -  మిస్సమ్మే S.V.R కూతురు అని ప్రేక్షకులకి తెలుసు. కాని పాత్రలకే  తెలియదు. అది  A.N.R కనిపెట్టాలి. కాని A.N.R బయటకి వచ్చి సిటీ అంతా లేక రాష్ట్రమంతా గాలించడం సాధ్యం కాదు. మిస్సమ్మే అక్కడికి వెళ్ళాలి. అప్పుడే అది సులువు అవుతుంది / సాధ్యమవుతుంది. మరి ఎందుకు మిస్సమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి? కారణం ఏంటి? ఈ ప్రశ్నలకు జవాబు గా,  S.V.R  వాళ్లకి 'స్కూల్' ఇచ్చారు. అందులో అధ్యాపకుల కొరత పెట్టారు. వాటికోసం ప్రకటన వేసారు, మిస్సమ్మ వచ్చేలా చేసారు, మన రచయిత. ఇది ఒక పక్క.
మరో పక్క, మిస్సమ్మ రావడానికి తనకు కూడా కారణం కావాలి కదా! అందుకే డేవిడ్ పాత్ర ను పెట్టారు. డేవిడ్ చేత అస్తమానూ అప్పు తీర్చండి, లేదా పెళ్లి చేయండి అని బలవంతపెట్టించి, పెళ్లి ఇష్టం లేదు కనుక అప్పు ఎలాగైనా తీర్చాలి అని మిస్సమ్మ అనుకునేలా చేయించి, ఈ ఉద్యోగానికి మిస్సమ్మ సిద్దపడేలా ఇబ్బందులను సృష్టించారు రచయిత.

ఇక తను ఒక్కత్తే వెళితే ఎం బాగుంటుంది నా మొహం. అందుకే రావు పాత్ర ని పెట్టారు. మరి ఇద్దరూ అక్కడికి వెళ్ళాక కథ రసవతరంగా సాగాలి కదా అందుకే, 'దంపతులకు మాత్రమే' అని S.V.R వారిచేత కండిషన్ పెట్టించి, దానికి తగ్గట్టుగా వీళ్ళిద్దరి చేతా నాటకం ఆడించేలా చేసారు రచయిత.

ఇదంతా SET-UP. కథయొక్క ముఖ్యభాగం జరగడానికి - మిస్సమ్మే S.V.R కూతురు అని తెలుసుకోవడం కోసం - చోటుచేసుకున్న సంఘటనలు. కురుక్షేత్రం జరగడానికి ముందు ధర్మరాజు జూదం ఆడినట్టుగా...  కాని దీని అర్థం ఇంతసేపు కథ లేదని కాదు. కథయొక్క  మొదటి దశ అనొచ్చు. ఈ మొదటి దశలో అసలు సమస్య ఏంటి, ఇందులో పాత్రలు ఎవరెవరు, వారి స్వభావాలేంటి  అనే విషయాలు తెలుస్తాయి. ఏమంటే పాత్రల స్వభావాలు కాస్త ఎక్కువగా తెలుస్తున్నాయ్. ముఖ్యంగా మిస్సమ్మ స్వభావం.

ఇక తదుపరి, మన రావు గారి స్వభావం గురించి, ఆయనకీ మిస్సమ్మ కి ఉన్న స్వభావాల తేడాల గురించి తెలుసుకుందాం... అలాగే కథ లో ముందుకు వెళదాం...!

- శ్రీధీష

No comments:

Post a Comment