Friday, August 29, 2014

మిస్. మేరి... మిస్సమ్మ...మహానటి... - 3

ఆ స్కూల్ టీచర్ ఉద్యోగం చేయాలని నిర్ణయిన్చున్న తరువాత రోజు, మిస్సమ్మ మళ్లి ఆ పార్క్ కి వస్తుంది. రావు ని కలుస్తుంది. తనకు ఆ ఉద్యోగం తప్పని పరిస్థితుల వల్ల చేయాల్సివస్తోంది అని చెపుతుంది. తను ఒప్పుకున్నందుకు రావు సంతోషిస్తాడు. ఆ సంభాషణలలో మనకు రావు కి మిస్సమ్మ కి ఉన్న తేడాలు కనిపిస్తాయి. రావు కి అన్ని మతాలు ఒక్కటే, అన్నింటినీ ఒకేలా చూస్తాడు కాని మిస్సమ్మ మాత్రం తనకు క్రైస్తవం అంటేనే ఇష్టం అని చెపుతుంది. ఇది మళ్లి తన ఇష్టాల గురించి, అభిప్రాయాల గురించి ప్రేక్షకులకు చెప్పడమే.

మిస్సమ్మ లో సిగ్గు-భయం :
ఇంత దాక మిస్సమ్మ లో కోపం చూసినవారికి ఆమె లో సాధారణ ఆడపిల్లకు ఉన్నట్టు సిగ్గు-భయం  ఉంటాయి అని ఇక్కడ తెలుసుకుంటారు. ఇద్దరు 'భార్య-భర్తల' లా నటించడానికి ఒప్పుకున్నారు. 
డబ్బు అవసరం కోసం ఒకరి భార్య లా నటించడానికి తను ఒప్పుకున్నా, తనొక అమ్మాయి కనుక ఏదో తెలియని భయం మరియు సిగ్గు రెండు తనలో కనిపిస్తాయి. ఇది మొదటిసారి తనలో ప్రేక్షకులు చూస్తారు. ఈ సన్నివేశం తరువాత తను ప్రేక్షకులకి ఇంకా దగ్గరవుతుంది అనే చెప్పాలి.  అదే మిస్సమ్మ మజాకా. తను నవ్వినా, సిగ్గుపడినా, భయపడినా, కోప్పడినా - అది తనకు అందమే... చూస్తున్న ప్రేక్షకులకు ఆనందమే...

అలా ఇద్దరు కలిసి ఒక దరఖాస్తు పంపిస్తారు. అందుకు బదులుగా S.V.R వాళ్ళకి ప్రయాణ ఖర్చులకోసం రూ.100 M.O. కూడా చేస్తారు. (ఎంత మంచి రోజులో!) అలా మన మిస్సమ్మ మిస్సెస్ రావు గా రావు గారి తో కలిసి S.V.R
వాళ్ళ ఊరు వెళుతుంది.  అయితే వాళ్ళు వెళుతూ వెళుతూ తమతో పాటుగా రేలంగి ని కుడా తెసుకువెళతారు, ఇంటి పని చూసుకునే సహాయకుడిగా.

చురక - చిన్న చురక ఏంటంటే, రేలంగి డబ్బులకోసం వేషాలు వేయడం లో ఒకసారి స్వామీజీ వేషం వేస్తాడు. అప్పుడు ఒక పాట పాడుకుంటూ వస్తాడు/ "సీతారాం! సీతారాం! సీతారాం జయ సీతారాం! పైన పటారం లోన లొటారం, ఈ జగమంతా డంబాచారం... సీతారాం! సీతారాం! సీతారాం జయ సీతారాం!" ఈ పాట ముందే ఇలా వాడుకలో ఉందొ లేదో తెలియదు కాని, 'గుడుంబా శంకర్' సినిమా లో పవన్ కళ్యాణ్, స్వామీజీ లా బ్రహ్మానందం దగ్గరికి వచ్చినప్పుడు ఇవే లిరిక్స్ పాడుకుంటూ వస్తాడు. ఇది చూస్తుండగా అది గుర్తొచ్చింది.

మళ్లి మన కథ లోకి వచ్చేద్దాం...

రావు, మిస్సమ్మ, రేలంగి అందరు కలిసి S.V.R  ఊరికి వెళతారు. S.V.R కి మిస్సమ్మ ను చూడగానే తప్పిపోయిన వాళ్ల అమ్మాయి గుర్తువస్తుంది. ఇంటికి తీసుకెళ్ళాక S.V.R భార్య కి కూడా మిస్సమ్మ వాళ్ళ అమ్మాయి లానే అనిపిస్తుంది. ఇంక అక్కడినుంచి ఇద్దరూ మిస్సమ్మ కు అతి మర్యాదలు, అతి ప్రేమ చూపిస్తూ ఉంటారు. వాళ్ల వ్యవహారం మిస్సమ్మ కు నచ్చదు. ఇక ప్రతిసారి వాళ్ళమీద కస్సు- బుస్సులాడుతూ ఉంటుంది.
A.N.R  కు మిస్సమ్మే, S.V.R కూతురు మహాలక్ష్మి ఎందుకు కాకూడదు అనే అనుమానం తో ఉంటాడు. మిస్సమ్మ గురించి, రావు గురించి తెలుసుకోవాలని, రేలంగి దగ్గర విషయాలను ఆరాతీస్తూ ఉంటాడు. ఆవో మజా సన్నివేశాలు.

S.V.R రెండో కూతురు జమున. జమున మనకు సినిమా మొదలైనప్పుడే కనిపించినా ఆ పాత్ర ప్రాధాన్యతంతా కథ రెండో భాగం లో ఎక్కువగా ఉంటుంది. అదేంటో ముందు ముందు చూద్దాం.

ఇక ఒకే ఇంట్లో ఉండే రావు-మిస్సమ్మ ల మధ్య గిల్లి-కజ్జాలు నడుస్తూ ఉంటాయి. ఇవి మజా-మజా సన్నివేశాలు. 

స్కూల్ లో మరో టీచర్, మన అల్లు-రామలింగయ్య. ఈయన వైద్యుడు కూడా. విద్య చెప్పకుండా పిల్లలచే  వైద్యానికి మూలికలు నూరిస్తుండే విద్యా వైద్యుడు. అందుకని అల్లు ని తీస్తాడు S.V.R. అలా రావు అతని స్థానం లో రావడం తో అల్లు కి రావు అంటే పడదు. కాని కమెడియన్ కదా ఏమి చేయలేడు.

ఒకరోజు S.V.R మన రావు ని మిస్సమ్మ ని భోజనానికి పిలుస్తాడు. మన మిస్సమ్మ భోజన అలావాట్లు వేరు. కాని అది S.V.R వాళ్ళు గమనించకుండా రావు ఏదో సర్దిచెప్తూ ఉంటాడు. ఇలా మిస్సమ్మ అలవాట్లు, వ్యవహారశైలి, అభిప్రాయాలు ఏమాత్రం అనుమానించేలా ఉన్నా మన రావు వాటిని సర్దేస్తూఉంటాడు. అదే ఆయన పని.  ఇక ఆ భోజనం తరువాత, జమున నాట్యప్రదర్శన జరుగుతుంది. అందరికి అది నచ్చుతుంది. మన మిస్సమ్మ నిక్కచ్చి కనుక, నాట్యం బాగుంది కాని పాట బాలేదు, కావాలంటే నాదగ్గరకు రా పాట నేర్పిస్తాను అంటుంది.
మరుసటి రోజు జమున రావు ఇంటికి వస్తుంది. తను చాలా అమాయకురాలు. మిస్సమ్మ చాలా గడుసు. రావు సున్నితమనస్కులు. ఇక ఈ ముగ్గురి మధ్య జరిగే సన్నివేశాలు సినిమా రెండో భాగం లో హైలైట్స్.
అలా జమున కు మిస్సమ్మ నేర్పించే పాట,

"తెలుసుకొనవె చెల్లి.. అలా నడుచుకొనవె చెల్లీ...
మగవారికి దూరముగా మగువలెపుడు మెలగాలని...
తెలుసుకొనవె చెల్లి.. అలా నడుచుకొనవె చెల్లీ...

మనకు మనమే వారి కడకు పని ఉన్నా పోరాడని...
అలుసుచేసి నలుగురిలో చులకనగా చుసేదారని
తెలుసుకొనవె చెల్లి.. అలా నడుచుకొనవె చెల్లీ...

పది మాటలకు ఒక మాటయు బదులు చెప్పకూడదని
లేనిపోని అర్థాలను మనవెనుకనే చాటెదరని... 
తెలుసుకొనవె చెల్లి.. అలా నడుచుకొనవె చెల్లీ... "

ఈ పాట ద్వారా మనకు మిస్సమ్మ ఆలోచనలు, ఒక అమ్మాయి గా అబ్బాయిల పైన ఉన్న అభిప్రాయాలు
తెలుస్తాయి. ఇందుకు బదులుగా మన రావు పాట పాడుతాడు. అది,

"తెలుసుకొనవె యువతీ.. అలా నదుచుకొనవె యువతీ...
యువకుల శాసించుటకే, యువతులవతరించారని...
తెలుసుకొనవె యువతీ.. అలా నడుచుకొనవె యువతీ...

సాధింపులు బెదరింపులు ముడితలకిక కూడదని...
హృదయమిచ్చి పుచ్చుకునే చదువేదో నేర్పాలని...
తెలుసుకొనవె యువతీ.. అలా నడుచుకొనవె యువతీ...

మూతిబిగింపులు అలకలు పాతపడిన విద్యలని...
మగువలేపుడు మగవారిని చిరునవ్వులో గెలవాలని...
తెలుసుకొనవె యువతీ.. అలా నడుచుకొనవె యువతీ..."

(అప్పుడు రావు చెప్పిన మాటలు...కనీసం ఇప్పుడన్నా అమ్మాయిలు అలావాటు చేసుకుంటే ఎంత బాగుండు...)

ఈ సీక్వెన్సు లో, N.T.R. మరియు సావిత్రి వారికి వారే సాటి అని అనిపించుకున్నారు, ముఖ్యంగా మిస్సమ్మ. తను పాడుతునప్పుడు అభినయం కాని, N.T.R తనని కవ్విస్తూ పాడుతున్నప్పుడు కళ్ళలో కోపావేశం పలికించడం కాని ఒక్క మిస్సమ్మ... మహానటి సావిత్రి కే చెల్లింది.

- సాయి కిరణ్  

No comments:

Post a Comment